MANOOS AI: కొత్త జనరల్ ఏఐ ఏజెంట్ 4 d ago

ఇప్పటికే వాడుకలో ఉన్న అగ్రశ్రేణి ఏఐ వేదికలకు దీటుగా 'మనూస్' పేరిట మరో కృత్రిమ మేధ జై వ్యవస్థను చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ 'మొనికా' అభివృద్ధి చేసింది. ఇది ఆలోచనలు, చర్యలకు మధ్య వారధిగా పని చేస్తుంది. ఇది కేవలం ఆలోచించడమే కాదు, ఫలితాలు సాధించి చూపుతుంది. ఈ ఏఐ ఏజెంట్ వినియోగదారులకు చక్కటి అనుభూతి ఇస్తుంది.
కొత్త వెబ్సైట్లను రూపొందించడం నుంచి విహార యాత్రలకు ప్లానింగ్ చేయడం దాకా ఎన్నో రకాల పనులను మనూస్ చేస్తుంది. కేవలం ఒక ఆదేశం ఇచ్చేస్తే చాలు మనకు కావాల్సిన పనులు పూర్తిచేస్తుంది. స్టాక్ మార్కెట్ ను విశ్లేషించడంలో బహు నేర్పరి. మనూస్ తనంతట తాను ఆలోచించుకోగలదు. ప్లాన్ చేసుకొని దాన్ని అమలు చేయగలదు. స్వయం చాలితం అని చెప్పొచ్చు. మనూస్ ను ఈ నెల 6వ తేదీన ఆవిష్కరించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
ఏమిటీ మనూస్? ఇదొక జనరల్ ఏఐ ఏజెంట్. వేర్వేరు రంగాలకు సంబంధించి సంక్లిష్టమైన, రియల్-వరల్డ్ పనులు పూర్తిచేయగలదు. సాధారణ ఏఐ చాట్ బాట్స్ తరహాలో కాకుండా విభిన్నంగా పనిచేస్తుంది. ఇది పూర్తిస్థాయి అటనామిస్ సిస్టమ్. ప్రణాళిక, కార్యాచరణ, ఫలితాలు.. అనే శ్రేణిలో పనిచేయగల సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్ పై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వమని సూచించామనుకోండి ఆ అంశంపై మనూస్ తనంతట తానే పరిశోధన సాగిస్తుంది. పేపర్ పై నివేదికను సిద్ధం చేసి మనకు అందజేస్తుంది.